Facebook Twitter
చీమ - అగ్గిపుల్ల

చీమ - అగ్గిపుల్ల

 

 

అనగా అనగా ఒక చీమ ఉండేది. వాళ్ల అమ్మను అది రోజూ అడుగుతూ ఉండేది- "అమ్మా, పిన్నమ్మ వాళ్ళ ఇల్లు ఎంత దూరం?"అని. అడిగితే, వాళ్ళ అమ్మ "చాలా దూరం" అనింది. "మరి, తాత వాళ్ళ ఇల్లు ఎంత దూరం?" అని అడిగితే "చాలా దూరంరా, కన్నా!" అని అమ్మ చీమ బదులిచ్చింది.  "ఓహో! మరి సూర్యుడు ఎంత దూరం అమ్మా?" అని అడిగితే అమ్మ చీమ అన్నది- "చాలా చాలా దూరంరా బుజ్జీ!" అని అనింది. అయితే 'చాలా దూరం' అంటే ఎంతో చిన్నారి చీమకు అర్థం కాలేదు. 'చాలా చాలా దూరం' అంటే ఇంక ఏమాత్రమూ అర్థం కాలేదు. కానీ అర్థం చేసుకోవాలని గట్టిగా అనుకుంది అది. 

అప్పుడు ఇంక చిన్నారి చీమ ఒక అగ్గి పుల్లను తీసుకుంది. దాంతో కొలుచుకుంటూ వాళ్ళ పిన్నమ్మ ఇంటికి వెళ్ళింది. దాంతో 'చాలా దూరం' అంటే ఏంటో కొంచెం కొంచెం అర్థం అయింది దానికి.  చాలా నడిచింది కదా, దానికి బాగా కాళ్ళు నొప్పులు పుట్టాయి. పిన్నమ్మ పెట్టింది తిని, కొంచెం సేపు విశ్రాంతి తీసుకొని, అక్కడి నుండి మళ్ళీ అగ్గిపుల్లలతో కొలుచుకుంటూ‌ తాత వాళ్ళ ఇంటికి వెళ్ళింది.  తాత ఇల్లు చేరుకునేసరికి చిన్నారి చీమకు 'చాలా దూరం ' అంటే ఏమిటో బాగా అర్థమైపోయింది. 

 

తన ఇంటి నుండి పిన్నమ్మ ఇంటికి '9 అగ్గిపుల్లల దూరం' అని, అక్కడినుండి తాత ఇల్లు '13 పుల్లల దూరం' అని తేల్చింది.  'చాలా దూరం' అంటే దానికి బాగా అర్థమయ్యేసరికి, 'చాలా చాలా దూరం' అంటే ఏంటో సులభంగా ఊహించుకోగలిగింది అది. సొంత ప్రయత్నంతో చిన్న విషయాల్ని బాగా అర్థం చేసుకుంటే, పెద్ద విషయాలుకూడా సులభంగా తెలుస్తాయని చిన్నారి చీమకు బాగా వంటపట్టింది